నేతన్నలకు చేతినిండా పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఇందిరా మహిళా శక్తి చీరలతో ఉపాధి
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు -07 నేతన్నలకు చేతినిండా పని కల్పించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కోర్టు నుంచి పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహం వరకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంబించి.. ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్,
చేనేత, వస్త్ర పరిశ్రమ కార్మికులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్ల చేనేత, వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.
సిరిసిల్లలోని నేతన్నలు, కార్మికులు, ఆసాములు, యజమానులకు సంవత్సరంలో సుమారు ఎనిమిది నెలల పాటు పని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత సంవత్సరం 6 కోట్ల 70 లక్షలకు పైగా మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 కోట్ల 50 లక్షల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. త్వరలో మరో కోటి 50 లక్షలకు పైగా మీటర్లకు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలు, ఇతర అవసరాలకు సంబంధించిన వస్త్రాల ఉత్పత్తి ద్వారా కూడా స్థానిక నేతన్నలకు పని కల్పిస్తున్నామన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన రూ.400 కోట్లకు పైగా బకాయిలలో రూ.350 కోట్లకు పైగా చెల్లించి నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
2025–26 సంవత్సరానికి సంబంధించిన చీరల బిల్లుల్లో 80 శాతం చెల్లించామని, మిగిలిన 20 శాతం కూడా త్వరలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూదాన్ పోచంపల్లిలో వస్త్రాల బకాయిల చెల్లింపుపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.
నేతన్నల సంక్షేమం కోసం త్రిఫ్ట్ పథకం ద్వారా కార్మికుల పొదుపునకు ప్రభుత్వం సమానంగా చేయూతనిస్తోందన్నారు.
నేతన్నల బీమా పథకం ద్వారా ఇప్పటివరకు సిరిసిల్లలో 129 మందికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులకు రూ.25 కోట్ల మేర రుణమాఫీ చేయడంతో పాటు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొన్నారు.
పవర్‌లూమ్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 25 హెచ్‌పీ వరకు పవర్‌లూమ్‌లకు యూనిట్‌కు రూ.2 సబ్సిడీ అమలు చేయడం వల్ల మూతపడిన అనేక పవర్‌లూమ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. దీంతో యజమానులు, ఆసాములు, కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు..
చేనేతకు ప్రసిద్ధి చెందిన సిరిసిల్ల జిల్లాలో నేతన్నలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రైతన్నలు, నేతన్నలు సహా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డీఓ శ్రీధర్ బాబు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ సంతోష్, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, చేనేత, వస్త్ర పరిశ్రమ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.