చందుర్తి మండలం మల్యాలలో పట్టు పురుగుల పెంపకం కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్
చందుర్తి, ఆగస్టు -04 పట్టు పురుగుల పెంపకం ఆదాయం పొందేందుకు ఒక మార్గమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో కల్లెడ శైలేష్, కల్లెడ లక్ష్మణ్ రెండు ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తూ.. షెడ్ వేసి పట్టు పురుగులు పెంచుతుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు.
ముందుగా మల్బరీ తోట సాగును పరిశీలించి.. మొక్కల రకం, ఎన్ని ఎకరాల్లో వేశారో ఆరా తీశారు. అనంతరం షెడ్లో పట్టు పురుగుల పెంపకం పరిశీలించి.. పురుగులు ఎక్కడి నుంచి తెస్తారు? ఎన్ని రోజుల్లో పట్టు తీయవచ్చు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మల్బరీ తోట సాగు, షెడ్ల నిర్మాణం, ఇతర పరికరాల కోసం సెరికల్చర్ శాఖ సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. 25 రోజుల్లోనే పట్టు చేతికి వస్తుందని వివరించారు. పట్టు పురుగుల శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ముందుకు వచ్చి సాగు చేయాలని సూచించారు. సంప్రదాయ పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా రైతులు వీటిని సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, పట్టు పురుగుల శాఖ అధికారి జగన్, తహసీల్దార్ భూపతి తదితరులు పాల్గొన్నారు.