Banner
Watermark
మోడల్ స్కూల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్*
📅 01 August 2026, 01:21 PM ✍️ admin
News Image
*పెద్దపల్లి, ఆగస్టు-1:* వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBV), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (URS)లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, వర్షాల కారణంగా పాఠశాలలు, వసతి గృహాల్లో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాములు, తేళ్లు, దోమలు, ఈగలు వంటి వాటి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టి విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

అన్ని తరగతి గదులు, వసతి గదులు, వంటగదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే త్రాగునీటిని ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా పరీక్షించి (వాటర్ టెస్టింగ్), విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు.

మండల, గ్రామస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్ నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ విద్యా వనరులను పూర్తిస్థాయిలో వినియోగించి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించాలని ఆదేశించారు.

విద్యార్థుల ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) నమోదు వంద శాతం పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే విద్యార్థుల హాజరు, విద్యా పురోగతి, ఆరోగ్యం, భద్రత, క్రమశిక్షణ అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్ తమ విద్యాసంస్థలో ఈ అంశాలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి లోపాలకు తావులేకుండా సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డి.ఈ.ఓ. శారద , జి.సి.డి.ఓ.కవిత, మల్లేశం,సంబంధిత శాఖల అధికారులు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లు, తదితరులు ,పాల్గొన్నారు.
---------------------------------------------------------------------------------------------------
*జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైనది*
🏠 Home