ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జూలై 31
జనగామప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
శుక్రవారం, జనగామ మండలంలోని గోపరాజుపల్లి గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల (యూపీఎస్)ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించి, విద్యా బోధన, మౌలిక వసతులు, పరిశుభ్రత, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పాఠశాలలోని ప్రతి తరగతి గదిని సందర్శిస్తూ, విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి అభ్యాస సామర్థ్యాలను పరీక్షించారు.
4వ తరగతిలో తెలుగు పాఠ్యాంశానికి సంబంధించిన పాఠాలను విద్యార్థులతో చదివించి, వారి పఠన నైపుణ్యాలను పర్యవేక్షించారు.
విద్యార్థులు పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటూ స్పష్టంగా చదివేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
1వ తరగతి విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం బలోపేతంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
3వ తరగతిలో ఉపాధ్యాయుడి బోధనను ప్రత్యక్షంగా పరిశీలించి, అభినందించారు. ఆంగ్ల భాషలో "Wild Animals" అంశాన్ని కలెక్టర్ విద్యార్థులకు స్వయంగా బోధిస్తూ, ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరీక్షించారు.
ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు అందాయా? లేదా? అనే విషయాన్ని కూడా ఆరా తీశారు.
5వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, కొత్త పాఠ్య పుస్తకాలు అందాయా? అని అడిగి, విద్యార్థులు ప్రతిరోజూ మంచిగా చదువుతూ, ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు.
6వ, 7వ తరగతి గదిని సందర్శించి, విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు. ప్రస్తుతం 28 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుసుకొని, మరింత మంది పిల్లలను పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు గణేష్ కు సూచించారు.
పాఠశాల వంట గదిని పరిశీలించి, మధ్యాహ్న భోజన తయారీ, పరిశుభ్రత, ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాలలోని మరుగుదొడ్ల గురించి ఆరా తీసిన కలెక్టర్, ఎల్లప్పుడూ పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. అలాగే పాఠశాల భవనంలోని తరగతి గదుల కిటికీలు, లైట్ల మరమ్మతులు చేయడంతో పాటు భవనానికి వైట్ వాష్ చేయించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం అదే పాఠశాలలో నిర్వహిస్తోన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, చిన్నారులకు అందిస్తున్న సేవలు, పోషకాహార పంపిణీ, కేంద్రం నిర్వహణ, తదితర అంశాలను పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అని అన్నారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు తప్పనిసరిగా అలవర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని స్పష్టం చేశారు.