Banner
Watermark
పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం, శాంతినగర్‌లో ఎస్‌ఐఆర్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
📅 28 July 2026, 04:31 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, జూలై-28: జిల్లాలో రెవెన్యూ సేవలు, భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ *బి. శ్రీరాములు* సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం శాంతినగర్‌లో కొనసాగుతున్న *ఎస్‌ఐఆర్ (Special Intensive Revision)* కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా భూ రీ-సర్వే ప్రక్రియను నాణ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అందించే మీసేవ ధ్రువపత్రాలను నిర్ణీత గడువులో జారీ చేయడంతో పాటు, భూ భారతి దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు.అదేవిధంగా సాదా బైనామా దరఖాస్తుల విషయంలో ప్రతి దరఖాస్తుదారునికి తప్పనిసరిగా నోటీసులు జారీ చేసి, పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

అనంతరం శాంతినగర్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్, ప్రతి ఓటరుకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను అవసరమైన వివరాలతో సేకరించి, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసి, ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలలో తహసీల్దార్ రాజయ్య, రెవెన్యూ అధికారులు, బీఎల్‌వోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home