సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జూలై-27:
సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సంబంధిత అధికారులతో నిర్వహించిన ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లాలో ఖరీఫ్ సాగు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, ఫార్మ్ పాండ్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం నీటి లభ్యత పరిమితంగా ఉన్నందున ఈ ఖరీఫ్‌లో వరి సాగును ప్రోత్సహించకుండా కందులు, పెసలు, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
పొలాలను బీడుగా ఉంచకుండా అందుబాటులో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా రైతులు ఆదాయం పొందడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా కొనసాగుతాయని తెలిపారు.
రాబోయే పది రోజులను ప్రత్యేక కార్యాచరణగా తీసుకొని గ్రామాల వారీగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని, ప్రతిరోజూ ఎంతమంది రైతులు పంట మార్పిడికి ముందుకొచ్చారో నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల మార్పిడి ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను సాధించాలని సూచించారు.
జిల్లాలో ఒంటరి మహిళా రైతులు, చిన్న, సన్నకారు రైతులకు ఆయిల్‌పామ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు జిల్లా యంత్రాంగం ద్వారా అదనపు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.
జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 2.91 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని, రైతులు భూములను సాగు చేయకుండా ఖాళీగా ఉంచితే రైతు భరోసా వంటి ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రతి ఎకరా సాగులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భూగర్భ జలాల మట్టాలను పెంపొందించేందుకు ఫార్మ్ పాండ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఫార్మ్ పాండ్ల నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులను 15 రోజుల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా పెద్ద రైతులు, ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పాండ్లు నిర్మించుకునేలా ప్రత్యేకంగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైనది