Banner
Watermark
ప్రభుత్వ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి
📅 12 June 2026, 02:44 PM ✍️ admin
News Image
చందుర్తి, జూన్ -12
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, బోధనపై అవగాహన కల్పిస్తూ.. విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలోని గొల్లపల్లిలో ప్రాథమిక పాఠశాల రెండు ఏండ్ల కింద మూతపడగా, బడిబాటలో భాగంగా విద్యార్థుల ప్రవేశాలు కల్పించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై.. విద్యాలయాన్ని పునః ప్రారంభించారు.

అదే విద్యాలయం ఆవరణలో అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం యూనిఫామ్ లు పంపిణీ చేశారు.

అలాగే కిష్టంపేటలో పూర్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు వచ్చిన ఆటల పరికరాలు, బొమ్మలను పరిశీలించారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య, ఈ ఏడాది ఎంత మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారో ఆరా తీశారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పుస్తకాలు, నోట్ బుక్ లు, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తుందని తెలిపారు. విద్యార్థుల తల్లితండ్రులు ఆలోచించి.. తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించాలని పిలుపు నిచ్చారు. సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతోపాటు ఆటలు ఉంటాయని వెల్లడించారు. పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని.. చదువుతోపాటు ఆటలు ఆడాలని సూచించారు.

కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ భూపతి, ఎంపీడీఓ రాధ, విద్యాశాఖ అధికారులు వినయ్ కుమార్, సతీష్, విద్య శాఖ, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home