Banner
Watermark
*AI, రోబోటిక్స్ రంగాల్లో విద్యార్థులు రాణించేలా ప్రత్యేక శిక్షణ*
📅 26 May 2026, 02:47 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, మే-26* ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ మరియు డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధికి నిర్వహించిన “సూపర్ సమ్మర్ కంప్యూటర్, AI & రోబోటిక్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్” ఎంతో దోహదపడిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

టి-ఫైబర్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఏప్రిల్ 27 నుండి మే 26 వరకు నెల రోజులపాటు మంథని, పెద్దపల్లి, రామగుండం మరియు సుల్తానాబాద్ కేంద్రాలలో నిర్వహించగా, మొత్తం 312 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి కేంద్రంలో ఆరు రోజుల పాటు కంప్యూటర్, AI, రోబోటిక్స్ మరియు డిజిటల్ స్కిల్స్ పై ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమం ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన “పెద్దపల్లి జిల్లా AI & రోబోటిక్స్ స్టూడెంట్ షోకేస్ – 2026” లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని నాలుగు ప్రాంతాల నుండి ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టులు, రోబోటిక్స్ నమూనాలు, AI ఆధారిత వినూత్న ఆలోచనలు మరియు డిజిటల్ స్కిల్స్ ప్రజెంటేషన్లు ప్రదర్శించి ఆకట్టుకున్నారని పేర్కొన్నారు.

భవిష్యత్తు సాంకేతికత ఆధారిత ప్రపంచంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఆధునిక సాంకేతిక విద్యలో ముందుండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యల పరిష్కార సామర్థ్యం మరియు సాంకేతిక అవగాహన పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి సారించి భవిష్యత్తులో AI, రోబోటిక్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్టిఫికెట్లు మరియు మెమెంటోలు అందజేసి సత్కరించారు.

జిల్లా పరిపాలన అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు మరియు ఆహ్వానిత అతిథులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

*జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.*
🏠 Home