Banner
Watermark
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం
📅 23 May 2026, 04:41 PM ✍️ admin
News Image
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..

శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కరీంనగర్‌లో గతంలో నిర్వహించిన జాబ్ మేళాల్లో ఎంపికైన రాజన్న సిరిసిల్ల జిల్లా అభ్యర్థులకు విప్ ఆది శ్రీనివాస్ నియామక పత్రాలు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారానికి 99 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహిస్తోందని, ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 70 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో గ్రూప్-1, ఉపాధ్యాయ నియామకాలు సహా పలు ఉద్యోగ నియామక ప్రక్రియలు చేపట్టామని మరిన్ని ఉద్యోగ నియామకాలు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని వారి కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నామని, పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు అందిస్తున్నామని, యువతి యువకులు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
🏠 Home