Banner
Watermark
ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలను సిద్ధం చేయాలి
📅 20 May 2026, 02:58 PM ✍️ admin
News Image
రాజన్న సిరిసిల్ల, మే -20 ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో అందుబాటులో ఉన్న గోదాంలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ధాన్యం సేకరణ, గోదాంల వినియోగం, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంపు, మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడం, సన్న రకాల సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం, తదితర అంశాలపై బుధవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాల, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, వ్యవసాయ, తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

జిల్లాలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందని, చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, రైతులకు క్షేత్ర స్థాయిలో భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజువారీగా సేకరణలో పురోగతి పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న గోదాంలను వినియోగంలోకి తీసుకువచ్చి, ధాన్యం నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తూకం వేసిన ధాన్యం బస్తాలను వాహనాల ద్వారా తరలించడం, దీని కోసం సరిపడా వాహనాలు సమకూర్చేలా సంబంధిత ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.

హమాలీల సంఖ్యను మరింత పెంచి ధాన్యం లోడింగ్, మిల్లులు, అపరల్ పార్కులో అన్ లోడింగ్ చేయడంలో వేగం పెంచాలని ఆదేశించారు.

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. సన్న రకం వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వచ్చే సీజన్ లో రైతులు సన్న రకం వరి సాగు చేసేలా సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో అవగాహన, విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.

అకాల వర్షాలు పడితే ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, త్వరితగతిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
🏠 Home