Banner
Watermark
ఐటీఐల ఆధునీకరణతో యువతకు సుస్థిర ఉపాధి అవకాశాలు కల్పించాలి
📅 13 May 2026, 02:37 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, మే-13 పీఎం సేతు (PM SETU) పథకాన్ని పెద్దపల్లి జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

పీఎం సేతు (PM SETU) పథకం అమలు పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను ఆధునీకరించేందుకు పీఎం సేతు (PM SETU) పథకం ప్రవేశపెట్టిందని కలెక్టర్ తెలిపారు. ఈ పథకం క్రింద 50 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం 33 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం 17 శాతం నిధులు పరిశ్రమలు భరించి ఐటిఐ క్లస్టర్లను ఆధునికరిస్తూ ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.

వచ్చే ఐదు సంవత్సరాల్లో పెద్దపల్లి క్లస్టర్ పరిధిలో ఐటీఐల మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. అదనంగా పారిశ్రామిక భాగస్వాములు కూడా సుమారు రూ.40 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పీఎం సేతు అమలుకు హైదరాబాద్, ఓల్డ్ సిటీ, పటాన్‌చెరు, మేడ్చల్, సంగారెడ్డి, పెద్దపల్లి ప్రాంతాలను క్లస్టర్లుగా గుర్తించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలతో అనుసంధానం చేసి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.

పెద్దపల్లి జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సింగరేణి కాల్లిరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), ఎన్టీపీసీ లిమిటెడ్ సంస్థలతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నామని అన్నారు.

సింగరేణి ఎన్టీపీసీ అధికారులు వారి సంస్థల హెడ్ ఆఫీసులతో చర్చించి అవసరమైన అనుమతులు, నిధుల మంజూరు పొందాలని కోరారు.
ఈ పథకం అమలులో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV) ద్వారా నిధుల వినియోగం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ప్రతి సంవత్సరం సుమారు రూ.5 కోట్ల చొప్పున సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలు CSR, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కార్యక్రమాల కింద వ్యయం చేసే అవకాశముందని పేర్కొన్నారు.
జిల్లాలో ఉన్న పెద్ద పరిశ్రమల సహకారంతో స్థానిక యువతకు ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, సుస్థిర ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కలెక్టర్ తెలిపారు.

యువత నైపుణ్యాభివృద్ధి కోసం ఐటీఐల ఆధునీకరణ అత్యవసరమని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్వహణలో పరిశ్రమల ప్రతినిధులు కూడా భాగస్వాములుగా ఉండే విధంగా ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV) వ్యవహరిస్తుందని కలెక్టర్ వివరించారు.

ఈ సమావేశంలో సిపిఓ రవీందర్, సింగరేణి సంస్థలు, ఆర్జీ 1, ఆర్జీ 2, ఆర్జీ 3 ,ఎన్టీపీసీ సంస్థల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, పెద్దపల్లిచే జారీ చేయనైనది
🏠 Home