Banner
Watermark
మొక్కజొన్న నిల్వకు అదనంగా 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం సిద్ధం: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
📅 12 May 2026, 03:41 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, మే 12:జిల్లాలో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న నిల్వ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాములకు అదనంగా పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో గల ఐజి గోదాంలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి మండలంలోని రంగాపూర్‌లో గల ధాన్యం గోదాములను పరిశీలించారు. అనంతరం అప్పన్నపేటలోని ఎస్.ఆర్.ఆర్ రైస్ మిల్‌ను తనిఖీ చేశారు. అలాగే పాలకుర్తి మండలంలోని కన్నాలలో గల గణపతి ఇండస్ట్రీస్‌ను పరిశీలించి మొక్కజొన్న నిల్వ సామర్థ్యం, అందుబాటులో ఉన్న సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రేపటి నుంచి పెద్దపల్లి జిల్లాలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి రంగాపూర్ ఐజి గోదాంకు మొక్కజొన్న తరలింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిల్వ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగినంత హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. గోదాముల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించి నిల్వ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, పాలకుర్తి తహసీల్దార్ సునీత, డీటీసీఎస్ మహేష్, రవీందర్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home