సిరిసిల్ల, మే 11:(నేటి ప్రభాత దర్శని) జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నేత, న్యాయవాది కైలాస్ కుమార్ సిరస్వాల్ వినతిముష్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై విచారణ జరిపి, ప్రభుత్వ భూమిని కాపాడాలని బీజేపీ సీనియర్ నాయకుడు, న్యాయవాది కైలాస్ కుమార్ సిరస్వాల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్‌లో విలీనమైన ముష్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెం.106లో 12.05 ఎకరాల ప్రైవేట్ భూమికి ఆనుకొని ఉన్న సర్వే నెం.51లోని సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
గత గ్రామపంచాయతీ పెద్దలు, కొంతమంది అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిలో కలిపి, ఎలాంటి అనుమతులు లేకుండా, లేఅవుట్ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ నిర్మాణం చేసి ప్లాట్ల రూపంలో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన భూమి అక్రమదారుల చేతుల్లోకి వెళ్తోందన్నారు.
అందువల్ల సంబంధిత భూములపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, విచారణ జరిపి, ప్రభుత్వ భూమిని అక్రమదారుల నుంచి స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.