రాజీవ్‌నగర్‌లో అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి
సిరిసిల్ల, మే 11:( నేటి ప్రభాత దర్శిని) సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌నగర్ 11వ, 24వ వార్డుల్లో కిరాణా దుకాణాల పేరిట అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత, న్యాయవాది కైలాస్ కుమార్ సిరస్వాల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముష్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బెల్ట్ షాపుల కారణంగా యువత మద్యానికి బానిసలై అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు. అప్పటి జిల్లా కలెక్టర్ చర్యలతో అక్రమ విక్రయాలు నిలిచిపోయి పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. 2019లో ముష్టిపల్లి గ్రామపంచాయతీ సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత మళ్లీ కొందరు అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ యువతను మద్యం మత్తులోకి నెట్టుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రాజీవ్‌నగర్‌లోని గాంధీ విగ్రహం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిసరాల్లో ఈ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
దీంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులు రద్దు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.