Banner
Watermark
నేటి ప్రభాత దర్శిని వేగవంతంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరు
📅 30 April 2026, 03:33 PM ✍️ admin
News Image
రైతులకు మెరుగైన, నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరు ప్రక్రియను అత్యంత వేగవంతంగా కొనసాగిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ టి. వేణు మాధవ్ తెలిపారు.

ఏప్రిల్ 1 నుండి ఇప్పటివరకు కేవలం ఒక నెల వ్యవధిలోనే 860 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయడం శాఖ పనితనానికి , రైతుల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1752 సర్వీసులు మాత్రమే మంజూరు కావడం నేపథ్యంలో, ప్రస్తుత వేగం గణనీయమైన పురోగతిని సూచిస్తోందన్నారు.

వ్యవసాయ సర్వీసుల మంజూరుకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, పనులు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 1540 వ్యవసాయ సర్వీసులను జూన్ నెలాఖరు నాటికి పూర్తిగా మంజూరు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. రైతు సంక్షేమం – విద్యుత్ శాఖ ధ్యేయం అనే నిబద్ధతతో ప్రతి అర్హుడైన రైతుకు సత్వర సేవలందించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.

అలాగే వినియోగదారుల భద్రత, శ్రేయస్సు తమకు అత్యంత ప్రాధాన్యమని, పారదర్శకత, సమర్థతతో సేవలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తామని టి. వేణు మాధవ్ పేర్కొన్నారు.

“రైతు అభివృద్ధికి విద్యుత్ శాఖ ఎల్లప్పుడూ రైతు పక్షానే ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.
🏠 Home