Banner
Watermark
ధాన్యం కొనుగోళ్లలో టోకెన్ విధానాన్ని సరిగా అమలు చేయాలి బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
📅 22 April 2026, 01:57 PM ✍️ admin
News Image

బుధవారం, జనగామ మండలంలోని చౌడారం గ్రామ పంచాయతీ పరిధిలో గల (టీజీఎంఎస్ & జూనియర్ కళాశాల) పీఎం శ్రీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్, ఐటీ ల్యాబ్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ల్యాబ్, లైబ్రరీలను పరిశీలించి, ఏ ఏ పుస్తకాలు ఉన్నాయి అని లైబ్రేరియన్ ని అడిగి తెలుసుకున్నారు.

అలాగే పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఖచ్చితంగా ఉండేలా చూడాలన్నారు.

ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.

బడి బాట కార్యక్రమాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

ప్రతి మూడు నెలలకోసారి తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడం అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.

శుభ్రమైన నీరు.. ఆరోగ్యానికి ఆధారం అని తెలిపారు.

అనంతరం జనగామ మండలంలోని చౌడారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

ఈ క్రమంలో టోకెన్ల వారీగా జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించి, కేంద్ర నిర్వాహకులను, ఏఈఓను కలెక్టర్ అభినందించారు.

ఎండ దెబ్బ తగలకుండా రైతులు, అధికారులు, ఇతర సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ధ్యానం కాంటా వేసే విధానాన్ని పరిశీలించి, ఎప్పటికప్పుడు దాన్యం బస్తాల తూకం పూర్తిచేసి, సంబంధిత మిల్లులకు వెంటనే తరలించాలని సూచించారు.

తదనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌ను కలెక్టర్ సందర్శించి, పర్యవేక్షించారు.

ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

అలాగే బస్ స్టాండ్‌లో తాగునీటి సదుపాయాలను పరిశీలించి, అక్కడ అందిస్తున్న తాగునీటి నాణ్యతను స్వయంగా పరీక్షించేందుకు నీటిని తాగి, పరిశుభ్రత, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అదే విధంగా ప్రయాణికులు వేచి ఉండే సమయం తగ్గించేలా టికెట్లు వేగంగా జారీ చేయాలని, ఆలస్యం లేకుండా బస్సులు నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలని డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు ఇచ్చారు.

ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సేవలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ పరిశీలనలో సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home