ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా (224) అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ క్రమంలో ప్రజావాణికి వచ్చిన కొన్ని దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి..
ఘనపూర్ (స్టేషన్) మండలం, విశ్వనాథపురం గ్రామంలో నివాసం ఉంటున్న ఓ. వసంత... తమకు ఇల్లు వచ్చేలా చూడాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
సీతారాంపురం గ్రామం, దేవరుప్పుల మండలానికి చెందిన జీడ్డి నాగమ్మ, 2010లో 346 గజాల జాగా కొనుగోలు చేయగా, ఆ భూమిని నాలాగా మార్చుకోవాలని విక్రయదారుడు ప్రయత్నిస్తుండగా, ఆ నాలాను రద్దు చేసి, ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు తగిన న్యాయం చేయుట గురించి దరఖాస్తు చేసియున్నారు.
ఘనపూర్ (స్టేషన్) మండలం, నమిలిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న గుంటి గట్టయ్య, తనకు 21 గుంటల వారసత్వ భూమి ఉందని...తన పేరు మీదకు భూమిని రిజిస్ట్రేషన్ చేయించగలరని ఆర్జీ ద్వారా కోరారు.
కోమళ్ల గ్రామం, రఘునాథపల్లి మండలానికి చెందిన మేకల జయలక్ష్మి, తనకు ఇల్లు లేదని, కటిక పేదరాలు అని, కావున నివాస స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించనైనది.
జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్ 24లో నివాసం ఉంటున్న ఎం. కళ్యాణి, తనకు సొంత స్థలం ఉందని... ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని కోరుతూ దరఖాస్తును సమర్పించినారు.
ఈ ప్రజావాణిలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, ఎక్సైజ్ ఎస్పీ అనిత, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.