Banner
Watermark
గంభీరావుపేట సెక్షన్‌లో 3.0 కి.మీ. 33కేవీ ఇంటర్‌లింక్ లైన్ విజయవంతంగా చార్జ్ (నేటి ప్రభాత దర్శిని )
📅 17 April 2026, 04:25 PM ✍️ admin
News Image
రాజన్న సిరిసిల్ల సర్కిల్, గంభీరావుపేట సెక్షన్ పరిధిలోని కొత్తపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందించే మహత్తర లక్ష్యంతో 3.0 కిలోమీటర్ల పొడవైన 33కేవీ ఇంటర్‌లింక్ లైన్‌ను విజయవంతంగా శుక్రవారం చార్జ్ చేశామని ఎన్పీడీసియల్ చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్స్-1), బి. అశోక్ తెలిపారు.
విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చేపట్టిన ఈ ఇంటర్లీకింగ్ లైన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఆపరేషన్స్), సిరిసిల్ల టి. వేణు మాధవ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో, వారి సమక్షంలో అత్యంత విజయవంతంగా నిర్వహించబడిందనీ అన్నారు.
ఈ ఇంటర్‌లింక్ లైన్ ప్రారంభంతో కొత్తపల్లి, శ్రీగాధ, కొల్లమద్ది , రాజుపేట గ్రామాలకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని అశోక్ స్పష్టం చేశారు. ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడినప్పుడు లేదా భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రధాన విద్యుత్ లైన్లలో అంతరాయాలు సంభవించినప్పుడు, ఈ ఇంటర్‌లింక్ లైన్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గంలో నిరవధికంగా విద్యుత్ సరఫరా కొనసాగించడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. దీని వలన గ్రామీణ ప్రాంత వినియోగదారులకు కరెంటు అంతరాయాలు గణనీయంగా తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరాలో నిరంతరత సాధించడం వలన ఈ గ్రామాల రైతులకు వ్యవసాయ విద్యుత్ సకాలంలో అందుతుందని, గృహ వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సేవలు లభిస్తాయని, స్థానిక చిన్న పరిశ్రమలకు వ్యాపారాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉంటుందని శ్రీ అశోక్ వివరించారు. ఈ ఇంటర్‌లింక్ లైన్ ఏర్పాటు వలన విద్యుత్ వ్యవస్థలో రెండు మార్గాల సరఫరా (Dual Source Feeding) అందుబాటులోకి వచ్చిందని, ఇది ఆధునిక విద్యుత్ పంపిణీ వ్యవస్థకు ఒక మైలురాయి అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాన్ని నిర్ణీత సమయంలో, అత్యంత నేర్పుతో విజయవంతంగా పూర్తిచేసిన గంభీరావుపేట సెక్షన్ సిబ్బందిని,సంబంధిత ఇంజినీర్లను సీఈ శ్రీ బి. అశోక్ , ఎస్ఈ టి. వేణు మాధవ్ అభినందించారు. గ్రామీణ ప్రాంత వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ విభాగపు అత్యున్నత లక్ష్యమని, ఆ దిశగా నిరంతరం శ్రమిస్తామని వారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సర్కిల్ పరిధిలోని ఇతర సబ్‌స్టేషన్లకు కూడా ఇలాంటి ఇంటర్‌లింక్ లైన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఆపరేషన్స్) శ్రీ టి. వేణు మాధవ్ , డివిజినల్ ఇంజినీర్ ఎన్. అంజయ్య అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్లు ఆనంద్ , శ్రీమతి పద్మ మరియు గంభీరావుపేట సెక్షన్ సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home