Banner
Watermark
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 15 April 2026, 03:11 PM ✍️ admin
News Image
బుధవారం, జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రంలో, అలాగే కొడకండ్ల మండల కేంద్ర పరిధిలో, అదే విధంగా కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామ పంచాయతీలో కొనసాగుతోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణాల్లో నాణ్యత, పురోగతి, సౌకర్యాల అమలు వంటి అంశాలను సవివరంగా తనిఖీ చేశారు.

ప్రతి ఇల్లు వద్ద గదుల నిర్మాణం, ప్లాస్టరింగ్ పనులు, తలుపులు, కిటికీల అమరిక, విద్యుత్, తదితరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విధంగా ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

అలాగే, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, ఇప్పటివరకు ఎన్ని విడతల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఎదురవుతున్న సమస్యలు, అవసరాల గురించి ఆరా తీశారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

అదే విధంగా కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా మురుగు కాలువలు నిరంతరం శుభ్రంగా ఉంచాలని, దోమల నివారణ కోసం ఫాగింగ్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, చెత్తతో కాలువలు మూసుకుపోకుండా జాగ్రత్త పడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.

ఈ పరిశీలనలో గృహ నిర్మాణ పీడీ మాతృ నాయక్, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home