రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా *విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట * వ్యవసాయ కనెక్షన్ల మంజూరు వేగవంతం
ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ - 13 తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని 132/33 కెవి , 33/11 కెవి సబ్‌స్టేషన్లను సోమవారం స్వయంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ట్రాన్స్కో అధికారులతో మాట్లాడుతూ పవర్ ఫ్యాక్టర్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు . పవర్ ఫ్యాక్టర్ .9 వస్తుందని చెప్పగా , ఇంకా పవర్ ఫ్యాక్టర్ మెరుగుపరచుకోవాలని సూచించారు . ఓవర్ లోడ్ ఉన్న ఫీడర్ ఉన్న వాటిని బదలాయింపు చర్యలు చేపట్టాలని , అలాగే కెపాసిటర్ బ్యాంకు లు పెట్టాలని అన్నారు . రైతులకు విద్యుత్ అంతరాయాలు కలగకుండా నిరంతరాయంగా సరఫరా అందించాలని ఆదేశించారు . అంతేకాక సబ్‌స్టేషన్ల యార్డ్ పరిసరాలను అన్నివేళలా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు .
విద్యుత్ మౌలిక సదుపాయాల పై సీఎండీ చర్చిస్తూ , వినియోగదారులకు , రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాలని చెప్పారు .
ఈ సందర్బంగా సీఎండీ మాట్లాడుతూ సెస్ బాధ్యతలు స్వీకరించే సమయానికి (ఏప్రిల్ 1) పెండింగ్‌లో ఉన్న 2491 వ్యవసాయ విద్యుత్ దరఖాస్తులను గుర్తించి , వీటిని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని , ఇప్పటి వరకు 431 కనెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వాటిని నెలవారీ ప్రాతిపదికన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు (AEs/ADEs) లక్ష్యాలను నిర్దేశించామన్నారు . కొత్త కనెక్షన్ల కోసం వినియోగదారులు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు .
సిరిసిల్ల పట్టణంలోని పవర్ లూమ్ యూనిట్లపై బిల్లింగ్ భారాన్ని తగ్గించేందుకు, వాటి టారిఫ్ కేటగిరీని 'కేటగిరీ-III' నుండి 'కేటగిరీ-IV'కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు . నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎన్పీడీసీఎల్ ఇప్పటికే దాదాపు ₹2.0 నుండి ₹2.5 కోట్ల వ్యయంతో సుమారు 80 సంఖ్యలో 33/11 kV సబ్‌స్టేషన్లను నిర్మించామని వెల్లడించారు . అనవసరమైన ట్రిప్పింగ్‌లను తగ్గించేందుకు ప్రతి సబ్‌స్టేషన్‌లో అత్యాధునిక ట్రాన్స్‌ఫార్మర్లు , బ్రేకర్లను ఏర్పాటు చేశామని తెలిపారు . . భవిష్యత్తు అవసరాల కోసం ₹45 కోట్ల అంచనా వ్యయంతో మరో 15 కొత్త సబ్‌స్టేషన్లను మంజూరు చేశామని చెప్పారు . . వీటిలో కొన్నింటికి ఇప్పటికే ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమి పూజ పూర్తయిందని , ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని అన్నారు .
గతంలో సెస్ హయాంలో ఒకే బ్రేకర్ ద్వారా 2-3 ఫీడర్లను అనుసంధానించడం వల్ల తరచుగా అంతరాయాలు కలిగేవి. దీనిని పరిష్కరించేందుకు ₹1.5 కోట్ల వ్యయంతో అదనంగా 20 బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని , ఈ పనులు 15-20 రోజుల్లో పూర్తవుతాయని వివరించారు .
విద్యుత్ నిరంతరాయంగా అందేలా సుమారు ₹30 కోట్ల వ్యయంతో 33 kV ఇంటర్ లింకింగ్ లైన్లను వేశామని చెప్పారు . . దీనివల్ల ఒక ఫీడర్‌లో సమస్య వచ్చినా, మరో మార్గం ద్వారా విద్యుత్ సరఫరా చేసే వీలుంటుంది అన్నారు .
ఇతర 17 జిల్లాల మాదిరిగానే సిరిసిల్లలో కూడా USLC విధానాన్ని అమలు చేస్తున్నామని , . దీనివల్ల సర్వీస్ కనెక్షన్ ఛార్జీలు సరళతరం చేయబడ్డాయి . గతంలో వినియోగదారులు చెల్లించే ₹20,000 నుండి ₹60,000 వరకు ఉన్న ORC ఛార్జీలను రద్దు చేశామని చెప్పారు . వినియోగదారులు చెల్లించాల్సిన రుసుము: వ్యవసాయ కనెక్షన్ల కోసం కేవలం కిలోవాట్‌కు ₹1,000 మాత్రమే అన్నారు .
నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే "గృహ జ్యోతి" పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని , అర్హులైన వారు సంబంధిత పత్రాలతో స్థానిక ఏఈ (AE) కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
'పొలం బాట/ప్రజా బాట' కార్యక్రమంలో భాగంగా వదులుగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయడం, మధ్యలో స్తంభాలను ఏర్పాటు చేయడం వంటి పనులను వేగవంతం చేశామని , అత్యవసర పరిస్థితుల కోసం 1000కి పైగా విద్యుత్ స్తంభాలను సిరిసిల్లలో సిద్ధంగా ఉంచామని , కరీంనగర్ స్టోర్స్ నుండి ₹5 కోట్ల విలువైన మెటీరియల్ ఇప్పటికే సిరిసిల్లకు తరలించామన్నారు .
అంచనాలు మరియు పనుల అమలులో పారదర్శకత కోసం 'SAP' ఆధారిత సాఫ్ట్ వేర్ విధానాన్ని ప్రవేశపెట్టి, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చామని , ఉన్నతాధికారులు నిరంతరం సిరిసిల్లలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షిస్తారన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించేందుకు ఎన్పీడీసీఎల్ కట్టుబడి ఉందని , ఈ క్రమంలో వినియోగదారులు నెలవారీ విద్యుత్ బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించాలని , గృహ జ్యోతి వంటి ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు .
సీఎండీ వెంట రాజన్న సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ బేతి బిక్షపతి, డివిజనల్ ఇంజనీర్ ఎన్ అంజయ్య తో పాటు ఏడీఈ శ్రీనివాస్, రాజలింగం , ఏ ఈ పృథ్విదర్ , ఏ ఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు