ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యం రోడ్డు భద్రతపై అప్రమత్తత అవసరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యమని...రోడ్డు భద్రతపై ప్రజలు అప్రమత్తత అవసరమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ - అలైవ్ లో భాగం గా రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని నెల్లుట్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల పంచాయతీ కార్యాలయంలో సోమవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. శిరస్త్రాణం (హెల్మెట్), సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఖచ్చితంగా శిరస్త్రాణం ధరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదు అని సూచించారు. అలాగే ఐఎస్ఐ ధృవీకరించిన హెల్మెట్ (శిరస్త్రాణం)లను మాత్రమే ఉపయోగించాలని, తద్వారా ప్రమాదాల సమయంలో తలకు పటిష్ట రక్షణ కల్పించి, ప్రాణ నష్టం తగ్గించవచ్చని వివరించారు.
పాదచారులు కూడా జాగ్రత్తగా రోడ్లు దాటాలని, నిర్దేశిత జీబ్రా క్రాసింగ్‌లను వినియోగించాలని చెప్పారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు.
అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు అరైవ్ - అలైవ్ కార్యక్రమ వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని (280) గ్రామ పంచాయతీల్లో రోడ్డు భద్రత గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి, సమావేశాలను చేపడుతున్నామని, అదే విధంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ నిబంధనల పట్ల బాధ్యతాయుత ప్రవర్తనను అలవరచడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రాణ నష్టాన్ని నివారించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, ఇతర సంబంధిత అధికారులు, పోలీసు అధికారులు, గ్రామ సర్పంచ్, పంచాయతీ, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.