జ్యోతిబాపూలే స్ఫూర్తితో ముందుకు సాగుదాం చదువును నమ్ముకుని ఉన్నతంగా ఎదగాలి కలెక్టర్ చిత్రా మిశ్రా
సమాజ సంఘసంస్కర్త, జ్ఞానమే వికాసమని చెప్పి బాలికల విద్య కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో మనందరం ముందుకు సాగుదామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.
మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ వద్ద జ్యోతిబాపూలే విగ్రహానికి కలెక్టర్.. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, నగరం మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,
ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.
ఏప్రిల్ నెలలో మహనీయులు జన్మించారన్నారు.
సమాజానికి పూలే అసమాన సేవలు అందించారన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం సాధ్యమని.. చదువును నిర్లక్ష్యం చేయవద్దని యువతకు సూచించారు. ఆ రోజుల్లోనే చదువు గొప్పతనం తెలుసుకొని.. బాలికలకు విద్య అందించేందుకు పాఠశాలలు, అనాథల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేసిన మహనీయుడని పేర్కొన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ 200 ఏళ్ల కిందటే అన్ని సమస్యలకు చదువే పరిష్కారమని నమ్మి.. బాలికల విద్యను ప్రోత్సహించారని గుర్తు చేశారు.
అంబేద్కర్ ముగ్గురు గురువుల్లో ఒకరైన పూలే కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు.
పూలే స్ఫూర్తితో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సమాజంలో అంతరాలు తగ్గించేందుకు కృషి చేస్తుందని వివరించారు. అందులో భాగంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చదువుతోనే జ్ఞానం లభిస్తుందని.. జ్ఞానంతో మన సమస్యలు మనమే పరిష్కరించుకుని శక్తి వస్తుందని పేర్కొన్నారు. తన భార్య సావిత్రిబాయి కి చదువు చెప్పి ఉపాధ్యాయురాలు చేసిన ఘనత ఆ మహనీయుడి సొంతమని గుర్తు చేశారు
మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సామాజిక అడ్డంకులను దాటుకుని బాలికలు చదువుకునేలా పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు.
డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న పూలే.. అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేశాడని వివరించారు.
ఈ సందర్భంగా పలువురు పూలే జీవితం గురించి వివరించారు.
అనంతరం అంబేద్కర్, పూలే ఆలోచనలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.