Banner
Watermark
మధ్యవర్తులను నమ్మవద్దు – ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
📅 07 April 2026, 12:45 PM ✍️ admin
News Image
---------------------------
పెద్దపల్లి, ఏప్రిల్ 07:
--------------------------
ప్రజల సమస్యల పరిష్కారానికి ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదని జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలకు సేవలు అందించే పేరుతో కొంతమంది మధ్యవర్తులు మోసాలకు పాల్పడుతున్నట్లు గమనించామని పేర్కొన్నారు.ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కొందరు వ్యక్తులు భూ భారతి సమస్యలు పరిష్కరిస్తామని, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు వంటి ప్రభుత్వ పథకాలలో ఎంపిక చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఎటువంటి అధికారిక గుర్తింపు లేదని, వారు ప్రజలను మోసం చేస్తున్నారని స్పష్టం చేశారు.

ఎవరైనా సమస్య పరిష్కారం పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే ఒక్క పైసా కూడా ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. అలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

ప్రజలు తమ సమస్యలను ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో నేరుగా జిల్లా కలెక్టర్ లేదా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని తెలిపారు. అలాగే బుధవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కలెక్టర్ ప్రజలను కలుసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మధ్యవర్తులను నమ్మి డబ్బులు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
🏠 Home