Banner
Watermark
విద్యార్థులకు కలెక్టర్ విద్యా బోధన పాఠ్యాంశాలపై విద్యార్థులచే చదివించి, సామర్థ్యాల పెంపు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 04 April 2026, 02:11 PM ✍️ admin
News Image
పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

శనివారం, జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని బండ్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తోన్న మౌలిక వసతులు, బోధన విధానం, ఉపాధ్యాయుల హాజరు, తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించారు.

మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అవుతుందో.. లేదో.. పర్యవేక్షించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని ఎస్ఓను అడిగి తెలుసుకున్నారు.

అలాగే భోజన శాలను పరిశీలించి, ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

ప్రధానంగా గుడ్ల నాణ్యతను పరీక్షించి, వంట సామాగ్రి, సరుకులు, బియ్యం తదితరాలను తనిఖీ చేసి, గడువు తేదీలను సరిచూసుకోవాలన్నారు.

పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు.

అదే విధంగా ప్రతి తరగతి గదిని సందర్శించి, విద్యార్థులకు బోధన చేశారు. గణితంపై నిశితంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభ విధానాల ద్వారా కలెక్టర్ బోధించారు.

అలాగే విద్యార్థులలో పాఠ్యాంశాలపై అవగాహన పెంచే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచించారు. ముఖ్యంగా గణితం వంటి విషయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, బోర్డు మీద ఉదాహరణలతో బోధించాలన్నారు.

విద్యార్థులతో ప్రత్యక్షంగా కలెక్టర్ మాట్లాడి, పాఠ్యాంశాలను చదివించి, అందులోని ప్రశ్నలు అడుగుతూ, వారి బోధన సామర్థ్యాలను పరీక్షించారు. ఈ మేరకు చదువుపై ఆసక్తి పెంచుకునేలా ప్రోత్సహించారు.

అంతేకాకుండా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి, రాబోయే పరీక్షలపై ఇప్పటివరకు చదివిన పాఠాలను మళ్లీ మళ్లీ పునశ్చరణ చేయాలని సూచించారు. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోవాలని, కంటినిండా నిద్ర పోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పట్టుదలతో కష్టపడి చదివి ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

ఈ పరిశీలనలో ఎస్ఓ అన్నపూర్ణ, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home