ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా... గురువారం
జిల్లాలోని తరిగొప్పుల మండలంలోని తరిగొప్పుల గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
ఈ సందర్భంగా.. ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించి, ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు.
అనంతరం వివిధ శాఖల అధికారులు వారి పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా వివరించారు.
రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వివరాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్ బుక్కులు, సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, తదితర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల పూర్తి వివరాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు.
అదే విధంగా నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, మధ్యాహ్న భోజన పథకం - ఇంటర్మీడియట్ కు విస్తరణ, విభిన్న ప్రతిభావంత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోటారు వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రీయ వ్యవసాయం పథకాలపై అవగాహన కల్పించారు.
అలాగే వివిధ పథకాల లబ్ధిదారులు ఈ సందర్బంగా వారి అభిప్రాయాలను తెలియజేస్తూ.. ప్రజా ప్రభుత్వంలో నిరుపేద లైన తమకి వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రజల సమస్యలను కలెక్టర్ నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు
తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
రైతు భరోసా, గృహ జ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు.
గ్రామ సభలో ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడం, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోసిన్, మండల ప్రత్యేక అధికారి రాణా ప్రతాప్, గ్రామ సర్పంచ్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.