పారిశుధ్య పనులు, నీటి సరఫరా పకడ్బందీగా చేయాలి వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ మెరుగైన సేవలు అందించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్
వేములవాడ, ఏప్రిల్ -01
----------------------------
వేములవాడ మున్సిపల్ పరిధిలో నిత్యం పారిశుధ్య పనులు, నీటి సరఫరా పనులు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో బుధవారం నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మాట్లాడారు. అందరి సహకారంతో ఇటీవల మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామని, నూతన సభ్యులకు అభినందనలు తెలియజేసారు. వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
బడ్జెట్ మీటింగ్ చాలా కీలకమని, రెవెన్యూ వ్యయంలో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు, రుణాల చెల్లింపు, పారిశుధ్య పనులకు చెల్లింపులు, ఇతర ఖర్చులు ఉంటాయని, తప్పనిసరిగా 10 శాతం గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, సంరక్షణకు ఖర్చు చేయాలని సూచించారు. మున్సిపల్ మొత్తం బడ్జెట్ లో 1/3 శాతం విలీన గ్రామాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి వినియోగించాలని తెలిపారు. మున్సిపల్ కార్మికులందరికీ వెంటనే బీమా చేయించాలని కమిషనర్ ను ఆదేశించారు. మున్సిపల్ కు రావాల్సిన పన్నులు 100 శాతం వసూలు చేయడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తే 15వ ఆర్ధిక సంఘం నిధులు మంజూరు అవుతాయని వెల్లడించారు. మున్సిపల్ వార్డ్ సభ్యులు తమ పరిధిలో ఇంటి, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేసేందుకు సహకరించాలని, అన్ని షాప్ లు లైసెన్స్ తీసుకునేలా చూడాలని సూచించారు. మున్సిపల్ నిధులతో నిర్మించిన భవానాలు అన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి రోజు పారిశుధ్య పనులు పక్కాగా చేయించాలని, తడి, పొడి చెత్త వేరువేరుగా ఇచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. తడి చెత్తను ఎరువుగా చేసి విక్రయించాలని, పొడి చెత్తను విక్రయిస్తే బల్దియాకు ఆదాయం వస్తుందని తెలిపారు. పార్క్ లు, వైకుంఠధామాలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. వేములవాడ గుడి చెరువు బండ్ పార్క్ ప్రారంభానికి సిద్ధం అవుతుందని, నిర్వహణ పక్కాగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. డీఆర్ సీసీ కేంద్రం పక్కాగా నిర్వహించాలని సూచించారు. నాంపల్లి గుట్టపై ఎయిర్ ఫోర్సు యుద్ద విమానం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య రాకుండా వార్డు సభ్యులు, అధికారులు చూసుకోవాలని తెలిపారు. ఏమైనా మరమ్మత్తు ఉంటే చేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ జయంత్ కుమార్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.