ఓపీ, ఐపీ కేసులు – రోజూవారి సేవలపై ప్రత్యేక దృష్టి విద్యార్థినులకు పోషకాహారం అందించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఏప్రిల్ 01
జనగామ
బుధవారం, జిల్లాలోని జఫర్గడ్ మండల పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో రోజూవారిగా వస్తున్న ఓపీ (ఔట్ పేషెంట్), ఐపీ (ఇన్ పేషెంట్) కేసుల సంఖ్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రసవాల కేసులు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో చర్చించారు. ప్రసవాల సంఖ్యను మరింతగా పెంచాలని సూచించారు. వార్డుల్లో రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు.
డెంటల్ విభాగం, స్కానింగ్ సెంటర్ పనితీరును పర్యవేక్షించారు. ఔషదాల నిల్వలను పరిశీలించి, గడువు తేదీలను సరిచూసుకోవాలన్నారు. డయాలసిస్ తీసుకుంటున్న రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న సేవల గురించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య కేంద్రాల పరిసరాల పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. రక్త నమూనాల సేకరణ, నిల్వ విధానాలను తనిఖీ చేసి, సరైన ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఈ క్రమంలో మౌలిక వసతులు మెరుపరచాలని, వైద్యులు, సిబ్బంది సమయానుగుణంగా అందుబాటులో ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం జఫర్గడ్ మండలంలోని సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాలను కలెక్టర్ సందర్శించి, వంటశాలను తనిఖీ చేశారు.
వంటకు ఉపయోగించే సామాన్లు, సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనం పరిశుభ్రంగా ఉండాలని, పోషకాహారం అందించాలని సూచించారు.
పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు, కంప్యూటర్ ల్యాబ్ వినియోగాన్ని కూడా పర్యవేక్షించారు.
పదవ తరగతి విద్యార్థినులతో మాట్లాడి, రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు.
ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.