ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలన అంగన్వాడీ, సఖి కేంద్రాల ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మంగళవారం, జనగామ మండలంలోని అడవికేశ్వాపూర్ గ్రామ పరిధిలో గల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం అమలు వంటి అంశాలను పర్యవేక్షించారు.
అలాగే కలెక్టర్ విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, వారి చదువు స్థాయి, పాఠ్యాంశాలపై అవగాహన గురించి పలు ప్రశ్నలు వేసి పరీక్షించారు.
మధ్యాహ్న భోజనం అమలుపై మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? ఆహార నాణ్యత, వంట విధానం, వంటశాల, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, పాఠశాలల్లో అన్ని సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం జనగామ మండలంలోని అడవికేశ్వాపూర్ గ్రామ పంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పోషకాహారం, సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు.
చిన్నారుల ఎత్తు, బరువు కొలతలను పరిశీలించి, వారి ఆరోగ్య స్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోషకాహారం సరైన విధంగా అందుతుందా? మెనూ ప్రకారం వంటలు తయారు చేస్తున్నారా? అనే విషయాలను కలెక్టర్ పర్యవేక్షించారు.
అంగన్వాడీ కేంద్రంలో ఆహార పదార్థాల నాణ్యత, వండే విధానం, పరిశుభ్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో ముఖ్యమని, అంగన్వాడీ సిబ్బంది బాధ్యతగా పని చేసి పిల్లలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
తదనంతరం జిల్లా కేంద్రంలో గల సఖి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేపట్టారు.
ఈ క్రమంలో సఖి కేంద్రంలో బాధిత మహిళలకు అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలపై కలెక్టర్ ఆరా తీశారు.
సేవలు సమయానికి, సమర్థవంతంగా అందుతున్నాయా? సఖి కేంద్రానికి ఎలాంటి కేసులు వస్తున్నాయి? వచ్చిన కేసులకు ఎలా కౌన్సిలింగ్ ఇస్తున్నారు? అని సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సఖి కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
మహిళలకు అందిస్తున్న కౌన్సెలింగ్, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలకు తక్షణ సహాయం అందించే విధంగా సిబ్బంది పని చేయాలని తెలిపారు.
ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.