ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా (232) ఆర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈనాటి గ్రీవెన్స్ లో వచ్చిన వాటిల్లో కొన్ని అర్జీల వివరాలిలా ఉన్నాయి..
ఘనపూర్ (స్టేషన్) మండలం, స్థానికంగా నివాసం ఉంటున్న ఆర్. దీనమ్మ, రెవెన్యూ శాఖకు సంబంధించి తన తండ్రి పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఎకరం 36 గుంటల భూమిని తన పేరు మీదకు మ్యుటేషన్ చేసి కొత్త పట్టదారు పాస్ బుక్ ఇవ్వగలరని మనవి చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు.
సంజయ్ నగర్ కు చెందిన ఆర్. సరిత, స్థానిక 16వ వార్డులో గత పది సంవత్సరాలుగా కిరాయికి ఉంటున్నారని, తమకు ఎటువంటి ఇల్లు లేదని, ఖాళీ స్థలం ఉందని, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఇంటికి వచ్చి ధ్రువీకరించారని, ఎల్1 జాబితాలో ఉండగా, కానీ తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఈ విషయమై ఇందిరమ్మ ఇల్లు ఇప్పించుటకు ఆర్జీ ద్వారా కోరారు.
ఘనపూర్ (స్టేషన్) మండలం, స్థానికంగా నివాసం ఉంటున్న గీతాదేవి రాథోడ్, 2019వ సంవత్సరంలో 623.25 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేయగా, ఇప్పుడు తమ కుటుంబ అవసరాల నిమిత్తం అమ్మకానికి చూడగా హౌస్ సైట్స్ అని చూపిస్తుందని, రిజిస్ట్రేషన్ కావడం లేదని, ఈ విషయమై తగు విచారణ జరిపి, తమకు న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించనైనది.
తమ్మడపల్లి గ్రామం, జఫర్గడ్ మండలానికి చెందిన రంగు సారంగపాణి, కల్లు గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్లు పై బడిన వారికి రూ. 2000 పింఛను ఇస్తోందని, తను కూడా దరఖాస్తు చేసుకోగా పింఛను రావడం లేదని, ఈ మేరకు పింఛను ఇప్పించగలరని కోరుతూ దరఖాస్తును సమర్పించినారు.
ఈ ప్రజావాణిలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.