మార్చి 18 జనగామ మెరుగైన వైద్యం అందాలి పదో తరగతి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని నెల్లుట్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, అలాగే దేవరుప్పుల మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ, హాజరు వివరాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ప్రశ్నపత్రాల పంపిణీ విధానం, పర్యవేక్షణ ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...
పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా సరిచూసుకోవాలని సూచించారు.
పరీక్ష తరగతి గదుల్లో పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయాలు సరిగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులకు, సిబ్బందికి విధుల్లో బాధ్యతగా ఉండాలని తెలిపారు.
అదే విధంగా దేవరుప్పుల మండల కేంద్ర పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఔషధాల నిల్వలు, వైద్యులు, నర్సుల హాజరు రిజిస్టర్, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.
వైద్య సిబ్బంది అందరూ అందుబాటులో ఉన్నారా? టీకాలు సరిగా వేస్తున్నారా? రోగులకు సరైన చికిత్స అందిస్తున్నారా? వంటి విషయాలపై ఆరా తీశారు.
ఈ క్రమంలో రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణీలు, శిశువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, తాగునీరు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు, అవసరమైన అన్ని మందులు నిల్వలో ఉండేలా చూడాలన్నారు.
ప్రభుత్వ ఆరోగ్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవలు మెరుగుపడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది తమ విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు.