యువ ప్రతిభను ప్రోత్సహించడంలో టీజీఐసీ కీలకపాత్ర జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యువ ప్రతిభను ప్రోత్సహించడంలో టీజీఐసీ కీలకపాత్ర ఆవిష్కరణలు పోటీకి తట్టుకునేలా ఉండాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యువత ప్రతిభను ప్రోత్సహించడంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టి జి ఐ సి) కీలక పాత్ర పోషిస్తున్నదని, వారి ఆవిష్కరణలు పోటీ మార్కెట్ కు తట్టుకునే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాలో ఉన్న ఔత్సాహిక ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ కరీంనగర్ లోని ఐటీ టవర్ లో "ఇన్నోవేషన్ పంచాయత్ " కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సదస్సుకు కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నుండి 60కి పైగా ఔత్సాహిక వ్యవస్థాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. నిధుల సేకరణ, వ్యాపార విస్తరణ, మార్కెటింగ్ మెళకువలకు సంబంధించి తమకున్న సందేహాలను నిపుణులతో చర్చించి నివృత్తి చేసుకున్నారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఆవిష్కరణ సవాలతో కూడినదని, వాటిని అమలు చేసే సమయంలో ఎన్నో అడ్డంకులు, లోపాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. వాస్తవ ప్రపంచానికి తగినట్లుగా ఉత్పత్తిని తీర్చిదిద్దడం చాలా అవసరమని తెలిపారు. ఆవిష్కరణలో వచ్చే కష్టాలు విజయానికి మార్గాలుగా భావించి వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఆలోచనలు సమాజంలో ప్రభావవంతమైన పరిష్కారాలుగా మారాలని ఆకాంక్షించారు. యువత, విద్యార్థులు తమ ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహాకాలపై మాత్రమే ఆధారపడకుండా మార్కెట్లో స్వతంత్రంగా నిలబడే స్థిరత్వాన్ని కలిగి ఉండాలని అన్నారు. కాలానికనుగుణంగా తమ సాంకేతికను మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. తెలంగాణలో యువత సృజనాత్మకత కొదువు లేదని, సరైన మార్కెట్ తోడైతే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీజీఐసీ సీఈవో మేరాజ్ ఫహీమ్, కమ్యూనికేషన్ మేనేజర్ బుద్ధవరపు వాణి పాల్గొన్నారు.