పకడ్బందీగా ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి - అదనపు కలెక్టర్ డి.వేణు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి - అదనపు కలెక్టర్ డి.వేణు
*ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షల నిర్వహణ
*ఇంటర్ పరీక్షల కోసం 22 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి
పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి
ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
పెద్దపల్లి , జనవరి- 21:
జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు . జిల్లాలో జనరల్, వోకేషనల్ కలిపి మొత్తం 7 వేల 965 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 22 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని,పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందించాలని, అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా ఆర్టీసీ బస్సులు పరీక్షా కేంద్రాల రూట్ లలో స్పెషల్ బస్సులు నడపాలని అన్నారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదివే ఇంటర్ విద్యార్దులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాలలో పనిచేసే ఇన్విజిలేటర్ లకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. పరీక్ష కేంద్రంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్షా ప్రశ్న పత్రాల లీకేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చీఫ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్న పత్రాల కవర్ సీళ్లు ఓపెన్ చేయాలని, ఆ సమయంలో అధికారులు సెల్ ఫోన్ తీసుకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి కల్పన, పెద్దపల్లి ఆర్డిఓ గంగయ్య, ఏసీపీ జి. కృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్ ,రమేష్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
.