నూతన ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మిస్తాముఅన్ని వసతులు కల్పిస్తాము
త్వరలో ఏటీసీ పనులు ప్రారంబిస్తాముప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రు ద్రంగిలో ఎం ఆర్ సీ భవనం ప్రారంభం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ రుద్రంగిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రుద్రంగి మండల కేంద్రంలో సర్వ శిక్ష నిధులు రూ. 48. 60 లక్షల నిధులతో మండల రిసోర్స్ భవనం (ఎంఆర్సీ) నిర్మించగా, శుక్రవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ప్రారంబించారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనం ఆవరణలో 21 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రుద్రంగిలో పలు ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవనాన్ని త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. స్థానికుల కోరిక మేరకు క్రీడల కోసం మైదానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలోని యువత, విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి, ఉపాధి పొందేందుకు శిక్షణ అందించే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కోసం రూ. 42 కోట్లు మంజూరు చేసిందని, టెండర్లు పూర్తి అయ్యాయని త్వరలోనే పనులు మొదలు పెడుతామని తెలిపారు. టాటా కంపెనీ సహకారం, బాగస్వామ్యంతో దీనిలో మొత్తం ఆరు కోర్సులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. మార్క్ ఫెడ్ ఆద్వర్యంలో గోదాం నిర్మాణానికి స్థలం గుర్తిసున్నామని, దాని పనులు ప్రారంబిస్తామని చెప్పారు. వేములవాడ నియోజకవర్గంలో రుద్రంగి రెండో అతి పెద్ద గ్రామమని తెలిపారు. విశాలమైన రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నియోజకవర్గం అభివృద్దికి అన్ని విధాలా సహకరిస్తున్నారని తెలిపారు. కలికోట-సూరమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు త్వరలో పరిహారం పంపిణి చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని, కబ్జాలో ఉన్న భూమి లేని అర్హులైన నిరుపేదల భూములు తీసుకోమని స్పష్టం చేసారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నియోజకవర్గానికి త్వరలోనే సాగు నీటిని విడుదల చేయిస్తానని తెలిపారు. 132/33 సబ్ స్టేషన్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. 5 కోట్ల పై చిలుకు నిధులతో సీసీ రోడ్లు నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఇందిర చౌక్ నుంచి కుక్కుల గండి వరకు రూ. 4 కోట్ల 57 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం, రుద్రంగి నుంచి దసరా నాయక్ తండా అప్రోచ్ సీసీ రోడ్డు హై లెవల్ బ్రిడ్జి 2 కోట్లు 50 లక్షలతో రోడ్డు నిధులు మంజూరు అయ్యాయని పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని వివరించారు. 50 ఏళ్లుగా రుద్రంగి గ్రామస్థులు ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి కి 1 కోటి 50 లక్షల రూపాయలు మంజూరు చేసి 30 పడుకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని తెలిపారు. రుద్రంగి నుండి రామకృష్ణ పూర్ పల్లెకు వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు పడేవారని, తానూ గెలిచిన 6 నెలల్లో రూ.62 లక్షలతో కల్వర్టు నిర్మాణం పూర్తి చేశానని పేర్కొన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ఇందిరా చౌక్ వరకు 1 కోటి 50 లక్షల రూపాయలతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, రుద్రంగి గ్రామంలో ప్రధాన రహదారి పై ఇరువైపులా 2 కోట్లతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టామని, నూతన పోలిస్ స్టేషన్ నిర్మాణం కోసం 2 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. రైతులు అంగీకరిస్తే వారికి నష్ట పరిహారం చెల్లించి అచ్చయ్య కుంట లో ,నగరాం చెరువును నీటితో నింపుతామని స్పష్టం చేసారు. భవనంతో సమావేశాలకు ఉపయోగం రుద్రంగిలో మండల రిసోర్స్ భవనం (ఎంఆర్సీ) అందుబాటులోకి రావడంతో విద్యాభివృద్ది సమావేశాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. అలాగే ఉపాద్యాయులు, విద్యార్థులు తల్లితండ్రుల సమావేశాలు నిర్వహించవచ్చని వివరించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయ భవనాల కోసం ఇంటి గ్రతేడ్ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ,ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,మార్కెట్ కమిటి చైర్మెన్ చేలుకల తిరుపతి, వేములవాడ ఆర్డీఓ రాదాభాయి, డీఈఓ వినోద్ కుమార్, టీజీ ఈడబ్ల్యూ ఐడీసీఈఈ అశోక్ కుమార్, డీఈ సత్యనారాయణ, తహసిల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.