మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ అభివృద్ధి సభలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోండి అంగన్వాడిలో మెరుగైన సేవలు మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం అభివృద్ధి చెందుతుందని, అందువల్ల ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
బొమ్మకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ సభకు హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వారి అభివృద్ధి, తద్వారా కుటుంబ, గ్రామ అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం సాధ్యమని అన్నారు. మహిళల సంక్షేమానికి ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రవేశపెట్టి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని సర్కారు ఆసుపత్రిలో నిర్వహించే ఆరోగ్య మహిళ ద్వారా ముందస్తుగా వ్యాధులను గుర్తించి నయం చేయించుకోవచ్చని అన్నారు. ఆరోగ్య మహిళ పరీక్షలతో ముందస్తుగా క్యాన్సర్ కేసులు గుర్తించి చికిత్స అందించిన సంఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. శుక్రవారం సభలోను మహిళలు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందవచ్చని సూచించారు.శుక్రవారం సభ ద్వారా మహిళల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నామని అన్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ లో డబ్బు వృధా చేసుకోవద్దని సూచించారు. అవసరమైన వారికి వైద్య సిబ్బంది ఇంటికి సైతం మాత్రలు తెచ్చి ఇస్తారని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలను చేర్పించడం ద్వారా చదువుతోపాటు పోషణ పై దృష్టి సారిస్తారని అన్నారు. లోప పోషణను నివారించేందుకు అంగన్వాడీలో అన్ని చర్యలు తీసుకుంటారని తెలిపారు. చదువు, ఆరోగ్యం పై శ్రద్ధ చూపే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ శుక్రవారం సభ ప్రారంభించినప్పటి నుండి మహిళల ఆరోగ్యం చాలా మెరుగైందని తెలిపారు. అనేకమంది రక్తహీనతను అధిగమించారని వివరించారు. ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాల్లో చేరాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ పథకాలు, ఉపాధి అవకాశాలు పొందవచ్చని అన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
ఫిర్యాదుల పెట్టే పరిశీలనబొమ్మకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫిర్యాదుల పెట్టెను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఫిర్యాదుల పెట్టెను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, వేధింపులకు గురైనా ఈ ఫిర్యాదు పెట్టెలో తమ ఫిర్యాదును నిర్భయంగా వేయవచ్చని సూచించారు. మహిళా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహణ ఉంటుందని తెలిపారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. భవిత కేంద్రం పరిశీలన బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని భవితా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ కేంద్రంలో ఉన్న దివ్యాంగ విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిలబస్ ప్రకారం దివ్యాంగులకు వివిధ బోధన ఉపకరణాలతో నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. దివ్యాంగుల మానసిక అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.మహిళా కానిస్టేబుల్ కు సన్మానం బొమ్మకల్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ జకినపల్లి హారికను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సన్మానించారు. బొమ్మకల్ అంగన్వాడీ కేంద్రంలో, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన హారికకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హారికను ఆదర్శంగా తీసుకొని ఉద్యోగాల్లో, పోటీ పరీక్షల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఇన్చార్జ్ డిడబ్ల్యుఓ సుగుణ, సిడిపిఓ సబిత, తహసీల్దార్ రాజేష్, వైద్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ఐఆర్పి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.