Banner
Watermark
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
📅 08 January 2026, 03:16 PM ✍️ admin
News Image

రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వారికి రూ.25 వేల ఆర్థిక సహాయం

ఆసుపత్రుల్లో రూ.1,50,000 వరకు క్షతగాత్రులకు వైద్య సహాయం

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రవాణా శాఖా ఆద్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు

హాజరైన ఎస్పీ మహేష్ బి గీతే

---------------------------------------------------------
తంగళ్ళపల్లి, జనవరి - 08 నేటి ప్రభాత దర్శిని
---------------------------------------------------------

రోడ్డు పై వెళ్లే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో రవాణా శాఖా ఆద్వర్యంలో డ్రైవర్లు, స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు. ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు రోడ్డు భద్రతా.. బాధ్యత.. ప్రమాదాల నివారణ పై పాటలు ఆలపించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అధికారులు, డ్రైవర్లు, స్కూల్ విద్యార్థులు రహదారి ప్రతిజ్ఞ చేశారు.

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. దేశంలో గత ఏడాది 4,80,000 ప్రమాదాలు జరిగాయని, దానిలో 1,70,000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రతి రోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మృతి చెందుతున్నారని వివరించారు. జిల్లాలో గత ఏడాది 268 ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఎక్కడైనా ఆసుపత్రికి వెళ్తే రోడ్డు ప్రమాద బాధితులే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మొదట బాధితులు డ్రైవర్లేననీ, ప్రతి డ్రైవర్ రోజు వాహన భద్రత ప్రతిజ్ఞ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలని సూచించారు. తమ కుటుంబ, పిల్లల బాద్యతను గుర్తు పెట్టుకొని జాగ్రతగా వెళ్లాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంతో డ్రైవర్ తోపాటు ఎదుటివారి జీవితాలు ఇబ్బంది పడుతాయని తెలిపారు. అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులతో మర్యాదగా ఉండాలని సూచించారు. ప్రతి నెలా రోడ్డు సేఫ్టీ కమిటి మీటింగ్ ఆర్అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా, ఆర్టీసీ అధికారులతో సమావేశం పెడుతున్నామని, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నివారణ చర్యలు, సైన్ బోర్డ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి పెట్రోల్ పోయవద్దనే ఆదేశాలు ఇస్తామని, నో హెల్మెట్ .. నో పెట్రోల్ అమలు చేస్తామని తెలిపారు. అందుబాటు ధరలో ఉండే హెల్మెట్ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తీసుకోవాలని, వాహనం ఎక్కినప్పటి నుంచి కింద దిగే వరకూ సెల్ ఫోన్ వినియోగించవద్దని వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకు వెళ్లి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం *రహవీర్ గుడ్ సామ్రతాన్* కింద రూ. 25 వేల సహాయాన్ని అందిస్తుందని, రోడ్డు ప్రమాద బాదితులకు ఆసుపత్రిలో రూ.1 లక్ష 50 వేల వరకు వైద్యం పొందే సదుపాయం ఉందని వెల్లడించారు.

*డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ వాడవద్దు*

డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి డ్రైవర్ ఫోన్ వినియోగించవద్దని ఎస్పీ మహేష్ బీ గితే సూచించారు. అపరిచిత డ్రైవర్లు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. స్కూల్ ఆటోలు, బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని స్పష్టం చేశారు. ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తోనే అవుతున్నాయని తెలిపారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సైకిల్ నడిపే పిల్లలు దానికి వాడే హెల్మెట్ వినియోగించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపవద్దని ఒకవేళ నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు భద్రత చర్యలు పకడ్బందిగా తీసుకోవడంతో గత ఏడాదితో పోలిస్తే 40 శాతం ప్రమాదాలు తగ్గాయని వెల్లడించారు. అసలు ప్రమాదాలే జరవద్దని ఆకాంక్షించారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్ చేయవద్దని సూచించారు.

*ప్రత్యేక చొరవతో ప్రతి నెలా రోడ్ సేఫ్టీ మీటింగ్..*

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక చొరవతో ప్రతి నెలా రోడ్ సేఫ్టీ మీటింగ్ పెడుతున్నారని, బ్లాక్ స్పాట్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారని, రోడ్డు పైకే వచ్చే చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర భద్రత చర్యలు చేపడుతున్నారని సిరిసిల్ల, వేములవాడ డిపో మేనేజర్లు కొనియాడారు.

*టైడ్స్ పరిశీలన*

అక్కడే ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టైడ్స్)ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితే కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా సిములేటర్ పై ఎస్పీ కూర్చుని దాని వినియోగం తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఇంజిన్, ఇతర వాహనాల విడిభాగాల వినియోగం తదితర దురై మురుగన్ వివరించారు. ఇక్కడ ఎందరికి ట్రైనింగ్ ఇవ్వవచ్చు,, ఉపయోగాలు తదితర అంశాలు ఇంచార్జి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖా అధికారి లక్ష్మన్, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ఆర్అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, సిరిసిల్ల, వేములవాడ డిపో మేనేజర్లు ప్రకాశ్ రావు, శ్రీనివాస్, ఎంవీఐ వంశీధర్, ఏ ఎంవీఐలు రజనీ దేవి, పృధ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home