Banner
Watermark
3 నుంచి 4 నెలల్లో భూసేకరణ, పరిహారం, పునరావాస ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు ప్రజలకు నిబంధనలపై అవగాహన కల్పించి, మానవతా దృక్పథంతో ప్రక్రియ పూర్తి చేయాలి
📅 27 October 2026, 03:08 PM ✍️ admin
News Image
ధర్మారం, అక్టోబర్ 27:చామనపల్లి గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం, పునరావాసం, పునరుద్ధరణ (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ అమలు చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

మంగళవారం ధర్మారం మండలం చామనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి నిర్వహించిన గ్రామసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, గత అనేక సంవత్సరాలుగా భారీ వర్షాలు కురిసినప్పుడు, నీటిని ఎత్తిపోసే సమయంలో చామనపల్లి గ్రామ ప్రజలు ముంపు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. 2006లో ధర్మారం మండలం నుంచి జడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, ఈ ప్రాంతంలోని గ్రామాలతో తనకు సుమారు 25 సంవత్సరాల అనుబంధం ఉందని పేర్కొన్నారు.

సాధారణంగా నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్‌) నుంచి 100 మీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, చామనపల్లి గ్రామ ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకొని తొలిసారిగా ఆ పరిమితికి మించి గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

ముఖ్యమంత్రి హామీ మేరకు భూసేకరణ

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా సూచించారని మంత్రి తెలిపారు. చామనపల్లి గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

గత 10 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోందని, దీనిని విజయవంతంగా పూర్తి చేసేందుకు గ్రామ ప్రజలందరూ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు, పరిహారం, పునరావాసానికి సంబంధించిన అంశాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

భూసేకరణ ప్రక్రియలో చిన్న చిన్న సమస్యలు ఎదురైతే వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించాలని మంత్రి తెలిపారు. ఈ అంశంలో రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలతో తనకు దీర్ఘకాల అనుబంధం ఉందని, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.

గ్రామంలోని ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, భూసేకరణ, పరిహారం, పునరావాసం విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను అందరూ కలిసి సమన్వయంతో పూర్తి చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు బలోపేతంలో భాగంగా నంది మేడారం చెరువు బలోపేతం చేపట్టిన నేపథ్యంలో చామనపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామానికి భూసేకరణ చేపట్టి పునరావాసం కల్పించాలని కోరారని తెలిపారు.ఈ అంశాన్ని పరిశీలించేందుకు 2023లో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని వివరించారు. ఎఫ్‌టీఎల్‌ నుంచి 100 మీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టి పునరావాసం కల్పించాలని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలిపారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం చామనపల్లి గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలని ఆదేశించిందని స్పష్టం చేశారు.

ప్రతి ఇంటి వివరాల నమోదు.. ఆస్తుల అంచనాలు

గ్రామంలోని ప్రతి ఇంటిని ఇప్పటికే సర్వే చేసి, కుటుంబ సభ్యులు, చెట్లు, బావులు తదితర వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అంచనాలను పరిశీలించామని, ఇంటిలోని కలప తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని అంచనాలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి నిర్మాణానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా నమోదు చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలోని ఇళ్లు, ఇతర నిర్మాణాలు, చెట్లు, బావులు, సంబంధిత ఆస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సర్వే సమయంలో ఎలాంటి వివరాలు మిస్ కాకుండా జాగ్రత్తగా పరిశీలించాలని, ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.

7 రోజుల్లో సామాజిక ప్రభావ అంచనా సర్వే పూర్తి

చామనపల్లి గ్రామం మొత్తానికి సామాజిక ప్రభావ అంచనా సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సర్వే కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గ్రామంలో వీడియో రికార్డింగ్ చేపడతామని తెలిపారు.

ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాజెక్టు నంబరు కేటాయించి, ఆ ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆస్తులు, ఇతర వివరాలను నమోదు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సామాజిక ప్రభావ అంచనా సర్వేను 7 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సర్వే బృందాలు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి, అవసరమైన వివరాలను సేకరించి, ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని పేర్కొన్నారు. సర్వే పారదర్శకంగా నిర్వహించి, నమోదు చేసిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.

ఆర్‌అండ్‌ఆర్‌ కమిటీ ద్వారా పునరావాసంపై నిర్ణయం

సామాజిక ప్రభావ అంచనా సర్వే పూర్తయిన అనంతరం ఆర్‌అండ్‌ఆర్‌ కమిటీని ఏర్పాటు చేసి, పునరావాసానికి సంబంధించిన అంశాలను చర్చిస్తామని తెలిపారు. ప్రస్తుతం పునరావాసం కోసం రెండు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు.

పునరావాస స్థలాల ఎంపిక, ప్రజలకు స్థలాల కేటాయింపు, ఇతర పునరావాస అంశాలపై ఆర్‌అండ్‌ఆర్‌ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అవసరమైన వారికి పునరావాస స్థలాలు కేటాయించడంతో పాటు, నిబంధనల ప్రకారం ఒకేసారి పరిష్కారం (వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌) పొందే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు.

ప్రజలకు అందుబాటులో అధికారులు

భూసేకరణ, పరిహారం, పునరావాసానికి సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఆర్డీవో బి. గంగయ్య, తహసీల్దార్‌ అందుబాటులో ఉంటారని తెలిపారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రాబోయే 3 నుంచి 4 నెలల్లో భూసేకరణ, పరిహారం, పునరావాస ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గ్రామ ప్రజలు తమ పూర్తి సహకారం అందించాలని కోరారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రతి దశలో ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.

గ్రామం మొత్తానికి భూసేకరణ చేపట్టడం, ప్రతి ఇంటి వివరాలను నమోదు చేయడం, సామాజిక ప్రభావ అంచనా సర్వే నిర్వహించడం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయడం వంటి అన్ని దశల్లో పారదర్శకత పాటించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పరిహారం, పునరావాస ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ గ్రామసభలో , ఆర్డీవో బి. గంగయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, తహసీల్దార్‌ శ్రీనివాస్, సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.
--------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారిణి, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home