Banner
Watermark
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.27 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల రెనోవేషన్ పనులను, రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన టాస్క్ (TASK) ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
📅 26 October 2026, 03:43 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, 2026 అక్టోబర్ 26: జిల్లాలోని యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు అన్నారు.

సోమవారం పెద్దపల్లిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.27 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల రెనోవేషన్ పనులను, రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన టాస్క్ (TASK) ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు మాట్లాడుతూ, జిల్లాలోని యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లిలో టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన అనేక మంది యువత ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. టాస్క్ కేంద్రం ద్వారా ఇప్పటివరకు కల్పించిన ఉద్యోగ అవకాశాలు, సాధించిన పురోగతికి సంబంధించిన వివరాలతో వారం రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు.

విద్యారంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.70 కోట్లు

పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యారంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. పాఠశాలల పునరుద్ధరణ, అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నామని, పెద్దపల్లి మండలంలోనే సుమారు రూ.14 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు.

ఈ విద్యా సంవత్సరంలో పెద్దపల్లి మండలంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించినట్లు తెలిపారు. గతంలో పెద్దపల్లి జిల్లా విద్యా ఫలితాల్లో 32వ స్థానంలో ఉండగా, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన చర్యల ఫలితంగా ప్రస్తుతం 8వ స్థానానికి చేరుకుందని వివరించారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉన్నత అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, లెక్చరర్లు విద్యాబోధన అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.800 కోట్ల వ్యయంతో అల్పాహార పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. హరే రామ ట్రస్ట్ సహకారంతో అమలవుతున్న ఈ పథకం పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు దోహదపడుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి

ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల జీవితంలో ఇంటర్మీడియట్ దశ అత్యంత కీలకమని, ఈ సమయంలో అనేక ఆలోచనలు, ఆకర్షణల వల్ల చదువుపై దృష్టి మరలే అవకాశం ఉంటుందని అన్నారు. అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని సరైన మార్గంలో నడిపించాలని సూచించారు.
విద్యతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ప్రస్తుతం విద్యార్థులకు చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని, విద్యార్థి దశలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఇప్పటి నుంచే లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు.

విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలకు చేరుకుని సమాజానికి సేవ చేయాలని, తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పెద్దపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి సాధించే విజయంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జిల్లా గర్వపడే స్థాయికి చేరుకోవాలని అన్నారు.

కళాశాలల్లో విద్యార్థులf హాజరును కఠినంగా పర్యవేక్షించాలని, హాజరు నిబంధనలు పాటించని విద్యార్థులను పరీక్షలకు అనుమతించకూడదని సూచించారు. ఈ విషయంలో రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో గణనీయమైన మార్పు

గత మూడేళ్లలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గణనీయమైన మార్పులు వచ్చాయని ప్రభుత్వ విప్ తెలిపారు. ఇటీవల పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు అవార్డులు లభించాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దె ద్వారా వచ్చే ఆదాయం నేరుగా కళాశాలకు చేరేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రుల వద్ద ఉన్న షట్టర్లను అద్దెకు ఇచ్చి వచ్చే ఆదాయాన్ని ఆసుపత్రుల అవసరాలకు వినియోగించేలా చూస్తున్నామని వివరించారు. పేద ప్రజలు విద్య, వైద్య సేవల కోసం ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, విద్యారంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు, పరీక్షా ఫలితాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రతి విద్యాసంస్థ విద్యా ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడేలా అవసరమైన నైపుణ్యాలను సంపాదించే విధంగా విద్యాబోధన అందించాలని సూచించారు.

ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు టాస్క్ కేంద్రం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో టాస్క్ కేంద్రం ద్వారా గత ఏడాదిన్నర కాలంలో సుమారు 2,600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు.

ఉద్యోగాలు కల్పించడంతోనే తమ బాధ్యత ముగిసిపోదని, ఉద్యోగాల్లో చేరిన యువతకు మూడు నెలల పాటు నిరంతరం ఫాలోఅప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారా, సక్రమంగా వేతనాలు అందుతున్నాయా అనే అంశాలను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలు ఇంటి నుంచే పని చేసుకుంటూ ఆదాయం సంపాదించేలా అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు కూడా జిల్లాలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంచేందుకు టాస్క్ కేంద్రం దోహదపడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డి.కల్పన, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, అధ్యాపకులు తదితరులు, పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారిణి, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home